ఏపీకి 361 మంది నేపాల్ బాధితులు..ఫలించిన మంత్రి లోకేశ్ కృషి
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారు విజయవంతంగా రాష్ట్రానికి చేరుకున్నారు.
By - Knakam Karthik |
అమరావతి: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారు విజయవంతంగా రాష్ట్రానికి చేరుకున్నారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి చేర్చి విజయవంతంగా ఆపరేషన్ నేపాల్ రెస్క్యూను ఏపీ మంత్రి నారా లోకేష్ పూర్తిచేశారు. నేపాల్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పలు ప్రాంతాల్లో బృందాలుగా ఏపీ యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ లోని ప్రత్యేక వార్ రూమ్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఇందుకోసం తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. వార్ రూమ్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ నిరంతరం సమన్వయం చేశారు. ఫలితంగా నేపాల్ లో చిక్కుకున్న చిట్టచివరి వ్యక్తి వరకు రాష్ట్రానికి చేరుకున్నారు.
మొత్తం 361 మంది ఏపీ వాసులను రక్షించి..
నేపాల్ లోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మొత్తం 361 మంది ఏపీ వాసులను రక్షించి ప్రత్యేక విమానాల ద్వారా వారందరినీ సురక్షితంగా మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి చేర్చారు. మంత్రి చొరవతో ఇప్పటికే 275 మందిని రాష్ట్రానికి రప్పించి వారందరినీ వారి వారి గమస్థానాలైన విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, తిరుపతికి చేర్చారు. మానససరోవర్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన చివరి 86 మంది సభ్యుల బృందం కూడా ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. వీరంతా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. దీంతో మొత్తం 361 మంది ఏపీ వాసులను రక్షించి వారివారి స్వస్థలాలకు చేర్చినట్లు అయింది. నేపాల్ లో ఇక ఎవరూ ఏపీ వాసులు లేకపోవడంతో ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ను అధికారులు మూసివేస్తున్నారు.