దావోస్ కు రేవంత్ రెడ్డి
జనవరి 14- 19 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లనున్నారు
By Medi Samrat Published on 29 Dec 2023 2:00 PM GMTజనవరి 14- 19 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన. ముఖ్యమంత్రి బృందం జనవరి 15న బయలుదేరి జనవరి 18న తిరిగి వస్తుందని సమాచారం. నాలుగు రోజులపాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు.
గత ఏడాది జనవరి మూడో వారంలో చివరి డబ్ల్యూఈఎఫ్ పర్యటన జరగ్గా, అప్పటి ఐటీ మంత్రి కెటి రామారావు నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో కేటీఆర్ దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులను తీసుకుని వచ్చారన్నది సమాచారం. తెలంగాణలో విదేశీ కంపెనీలు పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దావోస్ లో చర్చలు జరపనుంది. విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను ఈ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించనుంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితరాలను వివరించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా రేవంత్‌రెడ్డితో పాటూ దావోస్ వెళ్లనున్నారు.