తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి రానున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లనున్నారు.
రేపు ఉదయం 9.15 గంటలకు రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగే వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత విజయవాడ నుంచి తిరుగుప్రయాణమై, మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు దేవినేని ఉమాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పార్టీలు మారినప్పటికీ వారి మధ్య స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది.