విషాదం.. టీడీపీ నాయకుడు కన్నుమూత
TDP Senior leader yadlapati venkatrao passed away. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.
By అంజి Published on 28 Feb 2022 8:34 AM ISTటీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొంత కాలంగా వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని తన కుమార్తె నివాసంలో ఇవాళ ఉదయం వెంకట్రావు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులు చేపట్టారు. సంగం డడెయిరీకి వ్యవస్థాపక అధ్యక్షుడైన యడ్లపాటి వెంకట్రావు.. రైతు నాయకుడిగా ఎన్నో సేవలు చేశారు. 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసిన వెంకట్రావు, ఆ తర్వాత 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వేమూరు ఎమ్మెల్యేగా గెలిచారు.
మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నుండి రాజ్యసభ ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా చేశారు. వెంకట్రావు మృతి టీడీపీలో తీవ్ర విషాదం నింపింది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. వెంకట్రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని బోడపాడు గ్రామంలో రైతు కుటుంబంలో యడ్లపాటి వెంకట్రావు జన్మించారు. వెంకట్రావు తల్లిదండ్రులు రాఘవమ్మ , యడ్లపాటి వెంకటసుబ్బయ్య. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివారు. ఆ తర్వాత 1941 చెన్నైలో లా కాలేజీలో చదువుతూ, ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తరువాత న్యాయవాద వృత్తిని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అలవేలు మంగమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.