జగన్ బ్యాలెట్ పేపర్ కావాలని కోరడం విడ్డూరంగా ఉంది : ఎంపీ కేశినేని చిన్ని
మాజీ సీఎం జగన్ ఓటమిని అంగీకరించలేక.. ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేసే విధంగా మాట్లాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు
By Medi Samrat Published on 18 Jun 2024 3:30 PM ISTమాజీ సీఎం జగన్ ఓటమిని అంగీకరించలేక.. ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేసే విధంగా మాట్లాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జగన్ నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకి అర్ధమైంది.. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకి జగన్ విశ్వరూపం తెలియనుందన్నారు. జగన్ ఓటమిని అంగీకరించి.. హుందాగా ప్రజాజీవితంలోకి రాకపోతే.. రాబోయే మూడు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా కూడా మాజీ అవుతాడని.. అలాగే వైసీపీ కూడా మిగలదని అన్నారు.
జగన్ ఈవీఎంల టాంపరింగ్ వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ.. జగన్ 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయన్న జగన్.. ఇప్పుడు ఈవీఎంల విషయంలో మాట మార్చటంపై రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఓటర్స్ కి వీవీఫ్యాట్ లో ఓటు వేసిన సింబల్ కనిపించిందని పబ్లిక్ గా మీడియాతో మాట్లాడిన జగన్.. ఈ రోజు మాట మార్చి మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేయటమేనన్నారు. 2019లో జగన్ కి ఓటు వేసిన ప్రజలే.. అంతకుమించిన భారీ మెజార్టీతో ఇప్పుడు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారని ఆ విషయం గుర్తెరిగి మాట్లాడాలని సూచించారు.
ప్రజా తీర్పును గౌరవించలేక, ఓటమిని అంగీకరించలేకపోతున్న జగన్ ఈవీఎంల పై నమ్మకం లేదు.. బ్యాలెట్ పేపర్ కావాలని కోరటం విడ్డూరంగా వుందన్నారు. అయితే.. రాష్ట్రంలో ఓట్లు వేసిన 86 శాతం మంది ప్రజలు వారికి న్యాయం జరిగిందని అనుకుంటున్నారని తెలిపారు. ఓడిపోయిన తర్వాత జగన్ ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించటం చిత్రంగా అనిపిస్తుందన్నారు. ఏనాడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించని జగన్ ఈడీ కేసుల్లో త్వరలో జైలు వెళ్లటం ఖాయమన్నారు.
తనకు తిరుగులేదనుకున్న జగన్ ను ప్రజలు అధికార పీఠం నుంచి కిందకి దించారు. జగన్ ఇప్పటికి ప్రజలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నాడు.. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి రాష్ట్రంలో ఏమి జరుగుతుందో, ప్రజలు ఏమి కోరుకున్నారో తెలుసుకోవాలని కోరారు. ఇప్పటికైనా జగన్ ప్రజలు ఎందుకు తిరస్కరించారో.. ఎందుకు ఛీత్కరించారో ఆలోచించాలి.. అలా కాకుండా తన భ్రమల్లోనే వుంటే ఆ పార్టీతో పాటు, వున్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరంటూ హెచ్చరించారు.