రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగించిన టీడీపీ శ్రేణులు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన మోత మోగిద్దం కార్యక్రమంలో
By Medi Samrat Published on 30 Sept 2023 8:43 PM ISTటీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన మోత మోగిద్దం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయం దగ్గర మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి పాల్గొని విజిల్ మోగించారు. ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఈ నిరసన కార్యక్రమంలో విజిల్స్, గంటలు మోగించారు. హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొని డప్పు శబ్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు.. ఇళ్లలో ఉన్న వారు గంటలు, ప్లేట్లు, విజిల్స్ కొడుతూ చంద్రబాబు అరెస్ట్ పై నిరసన వ్యక్తం చేశారు. వాహనాలతో రోడ్లపై ఉన్న వారు హారన్ కొడుతూ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.
ఆలస్యం అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మోతమోగిద్దాం’’ అనే పిలుపు కేవలం చంద్రబాబుకు మద్ధతు తెలపడం ఒక్కటే కాదని.. న్యాయం జరగాలని కోరుకునే కార్యక్రమం అని పేర్కొన్నారు. న్యాయం గెలవాలి.. న్యాయమే తప్పకుండా గెలుస్తుందన్నారు. టీడీపీ చేపట్టిన మోతమోగిద్దాం కార్యక్రమంలో పిలుపులో పాల్గొన్న రాష్ట్ర ప్రజలకు, మహిళలకు బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు.