ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా కార్యక్రమాలను స్తంభింపజేసినందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యులను మంగళవారం ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.

By అంజి  Published on  6 Feb 2024 7:23 AM GMT
TDP MLAs, suspended, Andhra Pradesh, Assembly

ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా కార్యక్రమాలను స్తంభింపజేసినందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యులను మంగళవారం ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభాకార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించకపోవడంతో 10 మంది టీడీపీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. ఈ రోజు సభ సమావేశమైన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ధరల పెరుగుదలపై తమ వాయిదా తీర్మానాన్ని చర్చకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానం నోటీసును స్పీకర్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు సభ వెల్ లోకి దూసుకెళ్లారు.

తమ డిమాండ్‌పై చర్చకు మద్దతుగా నినాదాలు చేశారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ తమ సీట్లలో కూర్చోవడానికి నిరాకరించారు. వారిలో ఒకరిద్దరు కొన్ని కాగితాలను స్పీకర్ వైపు విసిరారు. కొందరు విజిల్స్ కూడా వేశారు. గందరగోళం మధ్య స్పీకర్ టీ విరామం ప్రకటించారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు, ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టి టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు.

టీడీపీ ఎమ్మెల్యేల తీరును మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు. స్పీకర్‌పై ప్రతిపక్ష సభ్యులకు గౌరవం లేదని, కుర్చీపై కాగితాలు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించడంతో స్పీకర్‌ వారిని ఒకరోజు సస్పెండ్‌ చేశారు. సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో స్పీకర్‌ మార్షల్స్‌ను పిలిచి వారిని బయటకు పంపించారు. సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్ నాయుడు, నటుడు ఎన్.బాలకృష్ణ ఉన్నారు.

టిడిపి శాసనసభ్యులు ధరల పెరుగుదల అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తడానికి ప్రయత్నించారు. చర్చకు పట్టుబట్టారు. అంతకుముందు ధరల పెరుగుదల సమస్యను ఎత్తిచూపేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా శాసనసభా ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ధరల పెరుగుదల, పన్నులు, చార్జీలతో ప్రజలపై భారం మోపిందని ప్లకార్డులు పట్టుకుని బ్యానర్‌ పట్టుకుని నినదించారు.

Next Story