వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి తమకు ఉందని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను తోపుదుర్తి సోదరులు రాజకీయం చేస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య మరణంపై బాధ పడిన తొలి వ్యక్తి తానేనని, లింగమయ్యను హత్య చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేసేందుకు తాను ముందుంటానని చెప్పారు. తోపుదుర్తి సోదరులు చెప్పిన మాటలు విని రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు చేయవద్దని జగన్ కు సునీత సూచించారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు జగన్ అడ్డుకున్నారన్నారు. వాహనాలను ఆపేసి కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతిని ఇచ్చారని అన్నారు.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి తెలిపారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.