టీడీపీ మహానాడుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు తేదీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు.

By Knakam Karthik
Published on : 4 May 2025 9:21 PM IST

Andrapradesh, TDP Mahanadu, CM Chandrababu, Kadapa

టీడీపీ మహానాడుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు తేదీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కడపలో 27, 28, 29వ తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తాం. మే 18వ తేదీ వరకు రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలి. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తాం. రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయం. కూటమి ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోంది..వాటిని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచిస్తున్నా..అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రానికి గతంలో ప్రధాని మోడీ వచ్చినప్పటికీ ఈ సారి అన్నింటినీ మరిపించేలా సభ జరిగింది. రాజధాని పనుల పునఃప్రారంభం కార్యక్రమంతో దేశం, ప్రపంచ దృష్టి అమరావతిపై వెళ్లింది. ప్రజలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి సభకు వచ్చి వెళ్లే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు, పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రధాని చేతులగా మీదుగా పునఃప్రారంభం చేశాం. వికసిత్-2047కు అమరావతి బలమైన పునాదిగా మారుతుందని ప్రధాని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి...అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ పూర్తి చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కార్యకర్తల, ప్రజల అభిప్రాయాల మేరకు నాయకులు పని చేయాలి. గుజరాత్ మోడల్ ఏపీలోనూ అమలవ్వాలి. సుస్థిర ప్రభుత్వం ఉండటంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యతే పార్టీకి కూడా ఇస్తున్నా. ఏడాది పాలనలోనే స్పష్టమైన మార్పులు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాం...అని సీఎం వ్యాఖ్యానించారు.

Next Story