'చలో అసెంబ్లీ' పిలుపులో భాగంగా మంగళవారం శాసనసభ సమీపంలోని భవనంపైకి ఎక్కి టీడీపీ నేతలు.. తమ తప్పుడు విధానాలతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టుతున్నారని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన నేతల్లో కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అంటూ వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా భవనం పైనుంచి కిందకు దించారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగకుండా అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేతలు సమీప వ్యవసాయ పొలాల నుంచి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉందని అనుమానిస్తూ పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇతర రాష్ట్ర నాయకులు కూడా హాజరయ్యారు.
మరోవైపు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా ఏడు బిల్లులను ఏపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.