టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పట్టాభికి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర నేతలు స్వాగతం పలికారు. పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారని... తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను కొట్టారని ఆరోపించారు. తనపై ఇప్పటికే నాలుగు సార్లు దాడి జరిగిందని, అయినా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. గన్నవరం ఘటనకు సంబంధించి పట్టాభితో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయానికి వచ్చిన గొడవ అదుపు చేసేందుకు వచ్చిన తనపై దాడి చేసి గాయపరిచారని గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టు పట్టాభికి, టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పట్టాభి, ఇతర టీడీపీ నేతల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో పట్టాభితో సహా టీడీపీ నేతలకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల చొప్పున పూచికత్తు ఇవ్వాలని ఆదేశించింది.