న్యాయమూర్తి ముందుకు పట్టాభి..!

TDP leader Pattabhi. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

By M.S.R  Published on  21 Feb 2023 4:40 PM IST
న్యాయమూర్తి ముందుకు పట్టాభి..!

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు, టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పోలీసులు పట్టాభిని ఈ మధ్యాహ్నం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. పీఎస్ లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. గన్నవరంలో గొడవలు ఎక్కువవడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన పట్టాభిని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. గన్నవరంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారంటూ పట్టాభిపై పలు సెక్షన్ల కింద‌ కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం వాహనంలో మరో ప్రాంతానికి తరలించారు.

గన్నవరంలో ప్రస్తుతం 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు. గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని తెలిపారు. పట్టాభి తొందర పాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని ఎస్పీ అన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో వున్నాయని.. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలులేదని స్పష్టం చేశారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్‌పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.


Next Story