పట్టాభి ఎక్కడున్నారంటూ..!

TDP Leader Pattabhi. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి

By M.S.R  Published on  25 Oct 2021 5:31 AM GMT
పట్టాభి ఎక్కడున్నారంటూ..!

జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి చేరుకోలేదనే వార్త మీడియాలో ప్రచారం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పట్టాభి హనుమాన్ జంక్షన్‌లో అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం క్రాస్‌ అయ్యారు పట్టాభి. పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గరకు 10.30 గంటలకు చేరుకున్న పట్టాభి వాహనం.. అక్కడ పోలీసులు పట్టాభి వెంట వస్తున్న వాహనాలను నిలిపివేశారని చెప్తున్నారు. అయితే, పట్టాభి ఇంటికి చేరుకుంటున్న మార్గమధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికేటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు పోలీసులు. పట్టాభి ఎక్కడికి వెళ్లాడో తమకు సంబంధం లేదన్నారు పోలీసులు. పట్టాభి ఇంటికి చేరుకోలేదని, హైదరాబాద్ వైపు వెళ్లారని సన్నిహితులు చెప్తున్నారు. పట్టాభి సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీకి సమాచారం అందినట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. గుంటూరు అర్బన్ పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరిలో నలుగురు విజయవాడ వాసులు కాగా, ఇద్దరు గుంటూరుకు చెందిన వారు. విజయవాడకు చెందిన జోగరాజు, షేక్‌ బాబు, షేక్‌ సైదా, సూర్య సురేష్‌, గుంటూరుకు చెందిన మోహన్‌ కృష్ణారెడ్డి, గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం తెలిపింది.

ఈ నెల 19న టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రెండు దాడులకు సంబంధించి విడివిడిగా కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.


Next Story