తన వ్యక్తిగత జీవితంపై ఓ మీడియా సంస్థ బురద జల్లిందని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిందన్నారు. తాను వేటికి భయపడే రకం కాదని, తప్పుడు వార్తలు రాస్తే చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ కోసం ప్రత్యేక ఐపీసీ సెక్షన్‌ను వైసీపీ పెట్టిందని మండిపడ్డారు. తనపై మర్డర్ సహా 13 కేసులు పెట్టారని, ప్రజల తరఫున పోరాడుతున్నందుకే తమపై దొంగ కేసులు పెడుతున్నారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తన తల్లి గురించి అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడరని, తాను కూడా వారి తల్లులు, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. అయితే తమ సంస్కృతి అది కాదని.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశానన్నారు. తన తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని నారా లోకేష్ శపథం చేశారు.
2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో ప్రజాధనంతో తాను రూ.25 లక్షల చిరుతిళ్లు తిన్నారని ఓ పత్రికలో కథనం వచ్చిందని, అయితే ఆ పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని నారా లోకేష్ చెప్పారు. తప్పుడు వార్తలు రాసినందుకు పలు మీడియా సంస్థలపై కేసు పెట్టానని లోకేష్ తెలిపారు. ఓ మీడియా సంస్థ క్షమాపణలు కోరిందని, మరో రెండు మీడియా సంస్థలు వివరణ కూడా ఇవ్వలేదన్నారు. వివేక హత్య తర్వాత చంద్రబాబుపై ఓ మీడియా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టిందన్నారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారని అన్నారు.