ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే.. అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని అన్నారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి... అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్.. తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి 33వేలకోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్లమంది జనం మాత్రమేనని నారా లోకేష్ అన్నారు. ''ఇప్పటికే నేను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే 2నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండండి'' అంటూ రాష్ట్రప్రజలకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.