పాలకులకు ద్వేషం కాదు.. విజన్‌ ఉండాలి: చంద్రబాబు

TDP leader Chandrababu said that rulers should have vision and not hatred. పాలకులకు ద్వేషం కాకుండా ప్రజల అభివృద్ధి పథం వైపు నడిపించే దృక్పథం ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

By అంజి  Published on  2 Sept 2022 2:12 PM IST
పాలకులకు ద్వేషం కాదు.. విజన్‌ ఉండాలి: చంద్రబాబు

పాలకులకు ద్వేషం కాకుండా ప్రజల అభివృద్ధి పథం వైపు నడిపించే దృక్పథం ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసక పాలన కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులు, పార్టీలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ పని చేస్తోందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు, ఐటీ విప్లవం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు గౌరవంగా బతుకుతున్నారంటే అందుకు టీడీపీయే కారణమని గుర్తు చేశారు.

సమస్యల పరిష్కారానికి సంపద సృష్టించకుంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ పాలన విధ్వంసంతో సాగుతుందని విమర్శించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ధరలు ఉన్నాయని ఆరోపించారు. పన్నులు, ధరల పెంపుదల వల్ల రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నారని, పేదలకు అన్నం పెట్టే వ్యక్తులు, సంస్థలపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు.

Next Story