టీడీపీ చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసనకు దిగారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న లోకేశ్ విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. రాజోలు సీఐ గోవిందరాజుతో లోకేశ్ వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా వెంట నాయకులు ఎవరూ రావడం లేదు. కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నాను. అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు’’ అంటూ లోకేష్ నిలదీశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే బైఠాయించి లోకేశ్ నిరసన తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చాలా ప్రాంతాల్లో అన్ని బస్సులను నిలిపివేయగా, విజయవాడలో సిటీ బస్సులు కూడా రోడ్డుపైకి రాలేదు.