చంద్రబాబు శ్రీరాముడు అయితే.. నేను హనుమంతుడిని : బుద్ధా వెంకన్న

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకోలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు.

By Medi Samrat  Published on  10 Dec 2023 3:45 PM IST
చంద్రబాబు శ్రీరాముడు అయితే.. నేను హనుమంతుడిని : బుద్ధా వెంకన్న

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకోలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గాంధీభవన్‍ దగ్గర టీడీపీ జెండాలు కనిపిస్తే చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. చంద్రబాబును విమర్శిస్తే ప్రతివిమర్శలు తప్పవని హెచ్చ‌రించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తాన‌ని.. వెస్ట్ సీటు ఇవ్వకపోతే ఆప్షన్‌-బీ గా అనకాపల్లి ఎంపీ సీటు ఉంద‌ని పేర్కొన్నారు. కొడాలి నాని తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఆడుదాం ఆంధ్ర ఇప్పుడేంటి.? నాని క్యాసినో ఎప్పుడో పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడికి పారిపోయినా తీసుకువచ్చి శిక్షలు వేస్తామ‌ని హెచ్చ‌రించారు.

చంద్రబాబు శ్రీరాముడు అయితే.. నేను హనుమంతుడిని.. సీటు తప్పకుండా అడుగుతాన‌ని అన్నారు. అడగకుండా అమ్మ అయినా అన్నం పెట్టదనేది వాస్తవం కదా.. బీసీగా నాకు తప్పకుండా ఎమ్మెల్యే సీటు ఉంటుందేనేది నా విశ్వాసం అని పేర్కొన్నారు. టీడీపీ కోసం నిలబడిన నాలుగైదురుల్లో బుద్దా వెంకన్న అనే వ్యక్తి ముందు ఉంటాడని పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబంపై ఈగ వాలకుండా ముందు నిలబడిన వ్యక్తిని నేను.. మాచర్లలో తురగా కిషోర్ అనే వ్యక్తి నాపై కర్ర తో దాడి చేశాడు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకు వస్తే.. ఎదురొడ్డి నిలబడ్డా.. కొడాలి నాని నోటికొచ్చినట్లు కూస్తున్నా.. నేను అతన్ని నిలదీశానని గుర్తు చేస్తూ టికెట్ డిమాండ్‌ను అధిష్టానం ముందుంచారు. పొత్తులు ఉన్నాయి కాబట్టి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను విజ్ఞప్తి చేస్తున్నా.. ఆప్షన్ ఏ ప్రకారం నా నియోజకవర్గంలో ఇవ్వకుంటే.. ఆప్షన్ బీ అయినా అమలు చేయాలని కోరతాన‌న్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తప్పకుండా ఏదొక సభలో నేను అడుగుపెడతానని ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story