దేశంలో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నడుస్తుంది. విపక్షాలు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించిన తరుణంలో.. కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎంపికయ్యే అవకాశం ఉందని.. ఇందులో భాగంగా కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే.. వెంకయ్యనాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమిరెడ్డి వీడియో ప్రకటన చేశారు. వెంకయ్యనాయుడు అందరికీ ఆమోదయోగ్యమైన మచ్చలేని వ్యక్తి అని, ఆయన పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయని, వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థి అయితే ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.