ప్రభుత్వ తప్పిదంతోనే 62 మంది మృతి.. ఓట్లేస్తే ప్రాణాలు బలిగొంటారా..?
TDP Chief Chandrababu fires on AP GOVT Over Floods.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2021 9:27 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పిదం వల్లే 62 మంది చనిపోయారని, రూ.6వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగిందన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. వరదలు సంభవించినప్పుడు ఏమీ చేయాలన్న దానిపై తాము అధికారంలో ఉన్నప్పుడు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని మండిపడ్డారు. తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీస్తారా? అని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. భారీగా వర్షాలు పడి రెండు సార్లు వరదలు వచ్చాయని.. అప్పటికే ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయని తెలిపారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా బాధ్యత లేకుండా వ్యవహరించారన్నారు. విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాలన్నారు.
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించపోవడం వల్లే గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62 మంది చనిపోయారని.. వరదల్లో రూ.6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు..? జ్యుడీషియల్ ఎంక్వయిరీ అడిగితే ఎందుకు అంగీకరించలేదు? అని చంద్రబాబు ప్రశ్నించారు.