టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో స్పష్టత!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.
By Srikanth Gundamalla
టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో స్పష్టత!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఎన్నికలకు శంఖారావం పూరించాయి. అయితే.. టీడీపీ, జనసేన ఈసారి జరగబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు టీడీపీ స్వతహాగా అభ్యర్థులను ప్రకటిస్తే.. జనవరి 26న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు స్థానాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే దానిపై తీవ్రంగా చర్చ కొనసాగింది.
చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.
సీట్ల పంపకాలపై గత కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చిందని సమాచారం. 25 నుంచి 30 స్తానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంకా కొన్ని స్థానాలను కేటాయించాలని... తమ తరఫున ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని చంద్రబాబుతో పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పోలిస్తే.. పార్టీ టికెట్‌పై ఈసారి పోటీకి చాలా మంది దిగేందుకు ఆశిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని జనసేన చెబుతోంది. విశాఖలో పార్టీ బలంగా ఉందనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులు, టీడీపీ పోటీ చేసే స్తానాల్లో జనసేన ఆశావహులకు పార్టీ అధినాయకత్వాలు సర్దిచెప్పనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమని మున్ముందు అవకాశాలు కల్పిస్తామని చెప్పనున్నాయి.