పొత్తు కుదిరిన రోజే విజయం ఖాయం అయ్యింది: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల కోసం ఉమ్మడిగా వెళ్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 2:00 PM ISTపొత్తు కుదిరిన రోజే విజయం ఖాయం అయ్యింది: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల కోసం ఉమ్మడిగా వెళ్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇందులో భాగంగానే శనివారం ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. 94 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. మిగతా అభ్యర్థులను త్వరలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల ప్రజల కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైసీపీ పాలనలో ప్రజలకు మంచి కన్నా కూడా ఎక్కువగా నష్టమే జరిగిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను జగన్ పూర్తిగా నాశనం చేశారంటూ మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని వర్గా ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖలో ర్యాలీ చేస్తే అడ్డుకున్నారని అన్నారు. అయితే.. రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు అయినప్పుడే విజయం ఖాయమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదన్నారు చంద్రబాబు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కోటి మంది అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్న వ్యక్తులనే ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు చెప్పారు. యువత, మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో 23 మంది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ నిలబెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటారని చెప్పారు. ఇక టీడీపీ కార్యకర్తలు పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గెలిచే సామర్థ్యం ఉన్నవారినే బరిలో నిలుపుతున్నట్లు చెప్పారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్తులను ఎంపిక చేశామన్నారు. అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఇరు పార్టీల అభ్యర్థుల ఎంపిక కొనసాగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనుందనీ చెప్పారు. ఇక పొత్తులో భాగంగా త్యాగాలు చేసినవారికి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన గుర్తింపు దక్కుతుందని పవన్ కళ్యాణ్ హమీ ఇచ్చారు.