అక్కడికి వస్తున్నాం: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి.
By Medi Samrat Published on 20 Sept 2023 3:15 PM ISTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ చర్చించింది. అయితే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన తమ వాణిని వినిపించాలని నిర్ణయించినట్లు టీడీపీ ప్రకటించింది.
ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలువురితో చర్చించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తదనంతరం జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని టీడీఎల్పీలో పార్టీ నేతలు నిర్ణయించారు. నారా లోకేశ్ అధ్యక్షతన జూమ్ ద్వారా టీడీఎల్పీ సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొనగా.. నారా లోకేశ్ ఢిల్లీ నుంచి జూమ్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నారా లోకేశ్ సూచించారు. పోరాటమే అజెండాగా టీడీపీ పనిచేయాలని.. ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని నారా లోకేశ్ సభ్యులకు సూచించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తోపాటు పలు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్ట సభలను వేదికగా చేసుకోవాలని.. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని లోకేశ్ సూచించారు. చట్టసభలలో చేయాల్సిన పోరాటం అక్కడ చేద్దాం అలాగే వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దామని లోకేశ్ అన్నారు.