కుప్పం యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను కాసేపట్లో బెంగళూరు తరలించనున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. నారాయణ హృదయాలయ ఆసుపత్రి చైర్మన్ దేవిశెట్టితో కుప్పం పీఈఎస్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలింపుపై చర్చించారు. ఎయిర్ అంబులెన్స్ లో తరలింపునకు అనుమతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బెంగళూరులో తారకరత్నకు చికిత్స నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో ఫోన్ లో మాట్లాడారు.
లోకేష్‌తోపాటు తారకరత్న కుప్పం మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుంచి బయటకు వస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. మాసివ్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయారని.. వెంటనే డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.