డీఎంకే గెలవదన్న చిలుక.. తమిళనాడు పోలీసులు ఏమి చేశారంటే.?

తమిళనాడులోని కడలూరులో చిలుక జోతిష్యం చెప్పే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిలుకలను బందీగా ఉంచినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on  10 April 2024 8:30 PM IST
డీఎంకే గెలవదన్న చిలుక.. తమిళనాడు పోలీసులు ఏమి చేశారంటే.?

తమిళనాడులోని కడలూరులో చిలుక జోతిష్యం చెప్పే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిలుకలను బందీగా ఉంచినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. పట్టాలి మక్కల్ కట్చి (PMK) కడలూరు నియోజకవర్గ అభ్యర్థి తంగర్ బచ్చన్ ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారని సెల్వరాజ్‌ అనే వ్యక్తి దగ్గర ఉన్న చిలుక తెలిపింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవ్వడంతో జిల్లా ఫారెస్ట్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. చిలుకలను బంధించడం నేరం అంటూ సెల్వరాజ్ తో పాటూ అతడి సోదరుడిని కూడా అరెస్టు చేశారు.

వైరల్ వీడియోలో చిలుక పంజరం నుండి బయటకు వచ్చి తంగర్ బచ్చన్ గెలుపుకు చిహ్నమైన కార్డును తీసింది. రాబోయే ఎన్నికల్లో తంగర్ బచ్చన్ విజయం సాధిస్తాడని చిలుక జోతిష్యుడు ప్రకటించాడు. దీంతో సంతోషించిన పీఎంకే అభ్యర్థి చిలుకకు అరటిపండు తినిపించాడు. వీడియో వైరల్ అవ్వడంతో అటవీ పోలీసులు చిలుకలను బోనులో బంధించినందుకు సెల్వరాజ్, అతని సోదరుడిని అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరికీ వార్నింగ్‌ ఇచ్చి విడుదల చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) షెడ్యూల్ 4 ప్రకారం, చిలుకలను పంజరంలో ఉంచడం చట్టవిరుద్ధం, ఎందుకంటే అవి వన్యప్రాణుల క్రింద వర్గీకరించబడ్డాయి. అందుకే అతడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే డీఎంకే కాకుండా పీఎంకే గెలుస్తుందని చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Next Story