బాగా హర్ట్ అయిన ఉండవల్లి శ్రీదేవి

టీడీపీ మూడో జాబితా వచ్చేసింది. వైసీపీ నుండి.. టీడీపీకి కొన్ని నెలల కిందట షిఫ్ట్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఊహించని షాక్ తగిలింది

By Medi Samrat  Published on  22 March 2024 9:00 PM IST
బాగా హర్ట్ అయిన ఉండవల్లి శ్రీదేవి

టీడీపీ మూడో జాబితా వచ్చేసింది. వైసీపీ నుండి.. టీడీపీకి కొన్ని నెలల కిందట షిఫ్ట్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఊహించని షాక్ తగిలింది. ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు సీట్ ఇస్తారని ఆశించారు. అయితే మూడో జాబితాలో కూడా శ్రీదేవి పేరు కనిపించకపోవడంతో ఆమె హర్ట్ అయ్యారు. ఆమె క్యాడర్ లో కూడా ఊహించని నైరాష్యం నెలకొంది.

ఈ పరిణామాలపై శ్రీదేవి స్పందించారు. రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైందని శ్రీదేవి పేర్కొన్నారు. బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్టు చేశారు. ఉండవల్లి శ్రీదేవి ఈ పోస్టులో ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించలేదు. ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున శాసనసభ్యురాలిగా గెలిచారు. అయితే గత ఏడాదిగా ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి దళిత వర్గానికి చెందిన మహిళ కాగా... ఈసారి ఎన్నికల్లో తిరువూరు (ఎస్సీ రిజర్వ్ డ్) అసెంబ్లీ స్థానం కానీ, బాపట్ల ఎంపీ స్థానం కానీ కేటాయిస్తారని ఆమె ఆశించారు. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో బాపట్ల ఎంపీ స్థానానికి తెలంగాణ బీజేపీ నేత కృష్ణప్రసాద్ ను తీసుకురావడంతో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు బరిలో దిగుతున్నారు. ఈ పరిణామాల కారణంగా ఉండవల్లి శ్రీదేవి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Next Story