వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ నిప్పులు చెరిగారు. ఏలేరు రిజర్వాయర్‌కు వచ్చిన వరదలకు గత ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యత అని వర్మ ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఏలేరు ఆధునికీకరణకు నిధులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. వైఎస్ జగన్ ప్రజలను, రైతులను మోసం చేశారని విమర్శించారు.
వరదల సమయంలో కాకినాడ తదితర ప్రాంతాల్లో జగన్ రాజకీయ పర్యటన చేయడం సిగ్గుచేటని వర్మ విమర్శించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య ఏలేరు ఆధునీకరణకు నిధులు మంజూరైతే, 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రతిపాదిత ప్రాజెక్టులను రద్దు చేశారని వర్మ అన్నారు. ప్రస్తుత ఏలేరు వరద సంక్షోభానికి జగన్ పూర్తి బాధ్యత వహించాలని వర్మ అన్నారు.