ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ సస్పెస్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. నాటుసారా మరణాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీలు శాసనమండలిలో మరోసారి ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. సారా మరణాలు సహజం కావని..అవి ప్రభుత్వ హత్యలేనని నినాదాలు చేశారు. విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి ఛైర్మన్.. టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోయారని అస్సలు ఊహించలేదన్నారు.
మండలి చైర్మన్ అనేకమార్లు టీడీపీ సభ్యులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో 8 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్న దృష్ట్యా ఎమ్మెల్సీలు రామ్మోహన్, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, ప్రభాకర్ ను ఒకరోజు సస్పెండ్ చేయాలని మంత్రి అప్పలరాజు మండలి చైర్మన్‌ను కోరగా..టీడీపీ ఎమ్మెల్సీలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.