ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు విచారణ..ఎన్జీటీ ఉత్తర్వులపై కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది

By -  Knakam Karthik
Published on : 23 Jan 2026 5:20 PM IST

Andrapradesh, Supreme Court, Illegal Sand Mining, Ysrcp, Tdp

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు విచారణ..ఎన్జీటీ ఉత్తర్వులపై కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసు కోర్టు నం.9లో ఐటెం నం.30గా లిస్టయ్యింది. ఏపీలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిషేధిస్తూ, పర్యావరణ నష్టం పరిహారంగా భారీ జరిమానా విధించాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, జరిమానాపై తాత్కాలిక స్టే ఇవ్వవచ్చని సూచిస్తూ, అయితే పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు పొందే వరకు ఇసుక తవ్వకాలు నిలిపివేయాలన్న ఎన్జీటీ ఆదేశాలు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ఇప్పటికే రూ.8 కోట్లు డిపాజిట్ చేసినట్లు, మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంపై రెండు మార్గాలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఒకటి.. వ్యవహారాన్ని తిరిగి ఎన్జీటీకి పంపి, పరిహారం గణన, అక్రమ తవ్వకాల పరిమాణం, లీజుల స్వభావంపై పునఃపరిశీలన చేయించడం. రెండోది.. ఈ కేసును సుప్రీంకోర్టే విచారించి, నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం. ఈ సందర్భంగా ధర్మాసనం, రాష్ట్ర వనరులపై ఘోర దోపిడీ జరిగిందని ఎన్జీటీ చేసిన నిర్ధారణ వాస్తవాధారితమైనదేనని వ్యాఖ్యానించింది. అక్రమంగా లీజు పరిధిని మించి తవ్వకాలు జరిగాయని, దాని వల్ల లాభపడ్డ వారు తప్పనిసరిగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రధాన ఎన్జీటీ ప్రొసీడింగ్స్ ముగిసిన నేపథ్యంలో, ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.

Next Story