రఘురామ కృష్ణరాజు విషయంలో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

Supreme Court On Raghurama Krishna raju Arrest. ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

By Medi Samrat
Published on : 17 May 2021 3:02 PM IST

supreme court

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి తరలించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. అది కూడా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి..! అందులో ఆయనకు చికిత్స అందించాలని.. ఆర్మీ ఆసుపత్రి వైద్య ఖర్చులను రఘురాజును భరించాలని చెప్పింది. ఈ చికిత్సా సమయాన్ని జ్యుడీషియల్ కస్టడీగానే భావించాలని.. రఘురాజు చికిత్సను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్ ఆఫీసర్ ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలని ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి చికిత్స నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రఘురాజుకు చేసే చికిత్సను వీడియోను తీయాలని.. ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఏపీ చీఫ్ సెక్రటరీ పాటించాలని.. ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే రఘురాజును గుంటూరు నుంచి సికింద్రాబాదుకు తరలించనున్నారు.

రఘురాజు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

రఘురాజుకు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టును ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ, మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించవచ్చని చెప్పారు. రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి పాలకమండలిలో ఇద్దరు వైసీపీ ఎంపీలు ఉన్నారని, వీలైతే ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించాలని కోరారు. ప్రభుత్వ తరపు న్యాయవాది దవే మాట్లాడుతూ, రఘరాజుకు ఆసుపత్రిలో చేరేందుకు అనుమతిని ఇవ్వకూడదని కోరారు. కేవలం చికిత్సకు మాత్రమే అనుమతించాలని అన్నారు. సొటిసిటర్ జనరల్ మాట్లాడుతూ, ఆర్మీ ఆసుపత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో రాజకీయాలకు అవకాశం లేదని ఒక న్యాయవాది సమక్షంలో చికిత్స చేయించవచ్చని వ్యాఖ్యానించింది.


Next Story