ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది

By Medi Samrat  Published on  19 Nov 2024 12:01 PM GMT
ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. సునీత తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్యకు సంబంధించి మొదటి నుంచి జరిగిన పరిణామాలను లూథ్రా సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని సిద్ధార్థ లూథ్రా సీజేఐ బెంచ్ కు తెలియజేశారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

ఇక వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి, జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం సీఎంఓ అధికారులను కూడా ఆమె కలిశారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై చర్చించారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

Next Story