పంచాయతీ ఎన్నికల వాయిదాకు ఒప్పుకోని సుప్రీం కోర్టు..!
Supreme Court green signal for local body elections. పంచాయతీ ఎన్నికల వాయిదాకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. ఏపీలో పంచాయతీ
By Medi Samrat Published on 25 Jan 2021 9:20 AM GMTపంచాయతీ ఎన్నికల వాయిదాకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. ఏపీలో పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని, స్థానిక ఎన్నికలు యథావిధిగా జరపాలని సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాయిదా కోరుతూ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం కొట్టివేసింది. ఉద్యోగ సంఘం తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు పనిచేయకుండా, పిటిషన్ వేయడం ప్రమాదకరమైన ధోరణి అని.. ఉద్యోగుల ప్రవర్తన పూర్తి అసంతృప్తికరంగా ఉందని, ఎన్జీవోలు చట్టానికి వ్యతిరేకమన్న భావన కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని.. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్ కౌల్ చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని .. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లక్షలమంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 5లక్షల ఉద్యోగులకు కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని, వారి సహకారం లేనిది ఎన్నికలు నిర్వహించలేమని ధర్మాసనం ముందు వాదించారు. అయితే ఈ వాదనలను సుప్రీం కోర్టు పట్టించుకోలేదు. ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ధర్మాసనం తీర్పును ఇచ్చింది.
వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని.. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు.