పేరు కూడా రాయలేని దుస్థితిలో హైస్కూల్ విద్యార్థులు.. కలెక్టర్ ఆగ్రహం
Students of Koneru Basavayya ZP High School are in the plight of not being able to write Telugu. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు.. కనీసం తమ పేరు కూడా రాయలేని దుస్థితిలో ఉన్నారు.
By అంజి Published on 23 Nov 2022 11:02 AM ISTప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు.. కనీసం తమ పేరు కూడా రాయలేని దుస్థితిలో ఉన్నారు. విజయవాడ నగరంలోని మోడల్ స్కూల్ కోనేరు బసవయ్య జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావుకు షాక్ తగిలింది. చాలా మంది తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు 'తెలుగులో సరైన వ్రాత నైపుణ్యాలు లేవు. సాధారణ గుణకార సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు. మోడల్ స్కూల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే సాధారణ పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలల నిర్వహణ నిధులు (ఎస్‌ఎంఎఫ్) ఏ విధంగా వినియోగిస్తున్నారో పరిశీలించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పటమట పట్టణంలోని కోనేరు బసవయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖధికారి రేణుకతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు సందర్శించారు. పాఠశాల పునరుద్ధరణకు ఇటీవల రూ.60 వేలు వెచ్చించారు. మరమ్మతుల విషయంలో డిల్లీరావు కలత చెందారు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయకపోవడం, నీటి లీకేజీలు అరికట్టడం, టైల్స్ ఏర్పాటు చేయకపోవడం వంటివి గుర్తించారు. మరమ్మతుల విషయమై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదో తరగతి విద్యార్థికి రాయడంలో నైపుణ్యం లేదు
తన తనిఖీ సమయంలో ఢిల్లీ రావు విద్యార్థుల తెలుగు నైపుణ్యాలను తనిఖీ చేయడానికి పదవ తరగతిని సందర్శించారు. తెలుగు పాఠంకు సంబంధించి పలు ప్రశ్నలను అడగగా విద్యార్థులు ఆన్సర్ చెప్పలేకపోయారు. ఒక విద్యార్థిని పిలిచి తెలుగులో ఒక పదం రాయమని అడిగారు. అతను దానిని సరిగ్గా రాయలేకపోయాడు. మరికొంత మంది విద్యార్థుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తరువాత.. ఢిల్లీరావు తొమ్మిదో తరగతిని సందర్శించి, ఒక విద్యార్థిని గుణకార సమస్యను పరిష్కరించమని అడిగాడు. విద్యార్థి సాధారణ సమస్యను పరిష్కరించలేకపోయాడు. దీంతో డీఈవో, హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తం 341 ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు
అనంతరం 341 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఎస్‌ఎంఎఫ్ ఎలా వినియోగిస్తున్నారో పరిశీలించాలని ఎంపీడీఓ, తహశీల్దార్లు, జిల్లా విద్యాశాఖాధికారులను కలెక్టర్ కోరారు. నాడు-నేడు కార్యక్రమంలో పూర్తి చేయాల్సిన పెండింగ్ పనులపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.