అన్నమయ్య జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థినిలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సుమారు 30 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోని వీరబల్లి కస్తూర్బా స్కూల్ జరిగింది. కలుషిత ఆహారం తినడంతో విద్యార్థినిలకు వాంతులు, వీరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థినిలను వెంటనే వీరబల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సదరు విద్యార్థిని మెరుగైన చికిత్స కోసం రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినీల తల్లిదండ్రులు కస్తూర్బా పాఠశాల చేరుకుని ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు కలుషిత ఆహారం పెట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే తరచూగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.