ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో సుమారు 1300 బస్సులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ప్రతి రోజు రాష్ట్రం నుంచి వివిధ పట్టణాలకు 600 సర్వీసులను ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నట్లు నిర్ధారణకు వచ్చింది. కర్నూలు జిల్లాలో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో అలర్ట్ అయిన ట్రాన్స్ పోర్టు అధికారులు..నిబంధనల పేరుతో దాదాపు 250 బస్సులను సీజ్ చేశారు.   
దీంతో ట్రాన్స్ పోర్టు అధికారులకు భయపడిన ట్రావెల్స్ యజమానులు 600 బస్సులను గ్యారేజీలకే పరిమితం చేశారు. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 800 సర్వీసులను గురువారం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిలిపివేశాయి. ఈ క్రమంలో ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను కలిసేందుకు అసోసియేషన్ అధ్యక్షులు ప్రయత్నించడంతో ఫలితం లేకుండా పోయింది. అసోసియేషన్‌కు ట్రాన్స్‌పోర్టు కమీషనర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. అయితే సోమవారం నుంచి పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ సర్వీసులను నిలిపివేసే యోచనలో యాజమాన్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.