సహిత విద్య అమలులో ఏపీ ముందుండాలి..అడ్వైజరీ కమిటీ దిశానిర్దేశం
సహిత విద్య అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలని రాష్ట్ర సలహా కమిటీ దిశానిర్దేశం చేసింది.
By - Knakam Karthik |
సహిత విద్య అమలులో ఏపీ ముందుండాలి..అడ్వైజరీ కమిటీ దిశానిర్దేశం
అమరావతి: సహిత విద్య అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలని రాష్ట్ర సలహా కమిటీ దిశానిర్దేశం చేసింది. సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు అధ్యక్షతన ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఏర్పాటైన రాష్ట్ర సలహా బృందం ఇటీవల సమావేశమైంది. ఏపీలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్థితిగతులను సమీక్షించింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఎస్పీడీ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో 747 మంది సహిత విద్య రిసోర్స్ పర్సన్స్ (IERPs) పనిచేస్తున్నారని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించడంతో పాటు ప్రతి శనివారం దాదాపు 3 వేలమంది విద్యార్థులకు ఇంటివద్దే (హోమ్ బేస్డ్) విద్య అందిస్తున్నామన్నారు. గృహాధారిత విద్యార్థులకు డ్రైరేషన్ (బియ్యం, గుడ్లు, చిక్కీలు) వంటివి అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో యూడైస్ ప్రకారం అన్ని పాఠశాలలో ప్రస్తుతం 1-12వ తరగతి వరకు 89,435 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారని, జూన్ 2024 నుండి నేటివరకు 16,238 మంది కొత్త విద్యార్థులను నమోదు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 679 భవిత కేంద్రాల ద్వారా 13,580 మంది పిల్లలకు ఫిజియో థెరపీ, రెమెడియల్ విద్య, కౌన్సెలింగ్ సేవలను అందిస్తున్నామన్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో రవాణా భత్యం (ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్) రూ. 3,000 నుండి రూ. 6,000కి పెరిగిందన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి అదనంగా రూ. 2,000 అలవెన్స్ ఇస్తున్నామన్నారు. ఇంటి వద్ద చదివే విద్యార్థులకు రూ. 3,000 సహాయం అందజేస్తున్నామని తెలిపారు.
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు స్పెషల్ ఒలింపిక్స్ భారత్ క్రీడల్లో జాతీయ స్థాయి పతకాలు సాధించారని రాష్ట్ర స్థాయి సలహా సభ్యులకు వివరించారు. దీంతోపాటు ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల బలోపేతానికి సంబంధించి చిన్న వయసులోనే వైకల్యాన్ని గుర్తించడం, ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ, డిజిటల్ లెర్నింగ్ టూల్స్ వంటి భవిష్యత్తు లక్ష్యాల గురించి చర్చించారు. రాష్ట్ర సలహా బృందం సభ్యులు భవిష్యత్తు కార్యాచరణపై సలహాలు, సూచనలు ఇచ్చారు.