కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు కీలక సూచన. మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏదైనా గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే మార్చి 3వ తేదీ తిరుమల ఆలయం తలుపులు ఉదయం 9 గంటలకు మూసివేయనున్నట్టుగా తెలిపింది. ఆరోజు రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్టుగా పేర్కొంది.
అనంతరం శుద్ది, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ఆరోజు రాత్రి 8..30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టుగా తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా... ఆ రోజున అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది.