చంద్రబాబు కోసం ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం
By Medi Samrat Published on 16 Sept 2023 4:07 PM ISTరాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 10 మందితో మెడికల్ టీమ్ ను ఆయన కోసం నియమించింది. వీరిలో ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఐదుగురు వైద్యుల్లో ముగ్గురు రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందినవారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియంత్రణలో వీరు ఉంటారు. మరో ఇద్దరు డాక్టర్లు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పరిధిలో పని చేస్తారు. చంద్రబాబుకు అవసరమైన అన్ని అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ ఆదేశించింది. రెండు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తం అనునిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు ఏపీ ప్రణాళిక శాఖ మెమో జారీ చేసింది. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అనుమతి లేకుండా విదేశాలకు పారిపోవడంపై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో విచారించేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారయ్యాడు. నోటీసుల గురించి తెలుసుకున్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లినట్లు అధికారులు గుర్తించగా, షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ కూడా సెప్టెంబర్ 5న దేశం విడిచి దుబాయ్ వెళ్లిపోయారు.