AndhraPradesh: ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతర హింసాకాండపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయనున్నారు.

By అంజి  Published on  17 May 2024 2:11 PM IST
SIT, poll violence, Andhra Pradesh

AndhraPradesh: ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతర హింసాకాండపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయనున్నారు. సిట్ ప్రతి హింసాకాండపై చర్య తీసుకున్న నివేదికను భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి సమర్పిస్తుంది. ఎఫ్‌ఐఆర్‌లు అదనపు తగిన ఐపీసీ సెక్షన్‌లు, ఇతర సంబంధిత చట్టబద్ధమైన నిబంధనలతో సవరించబడతాయి. చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా గురువారం న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎదుట హాజరయ్యారు. ఎన్నికల అనంతర హింసను అదుపు చేయడంలో పరిపాలన వైఫల్యానికి గల కారణాలను వ్యక్తిగతంగా వివరించేందుకు ఈసీ ఉన్నతాధికారులను పిలిపించింది.

మే 13న పోలింగ్ సందర్భంగా అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంపై ప్రధాన కార్యదర్శి, డీజీపీ తమ రిపోర్ట్‌లను పంచుకున్నారు. వారి నివేదిక ఆధారంగా 16 మంది అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. పల్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గరికపాటి బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్‌లను సస్పెండ్ చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ అధికారులపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించనున్నారు. ఎన్నికల సంఘం వై.రవిశంకర్ రెడ్డిని బదిలీ చేయడంతో నెల రోజుల క్రితం పల్నాడు జిల్లా ఎస్పీగా బిందుమాధవ్ బాధ్యతలు చేపట్టారు. కృష్ణకాంత్ పటేల్ కూడా రెండు నెలల క్రితం తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో.. ఈ అధికారులు హింసను నిరోధించడంలో విఫలమయ్యారని పేర్కొంది. ఈ జిల్లాల్లో రాజకీయ హింసాత్మక ఘటనలు జరుగుతున్నా అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారుల సస్పెన్షన్‌కు కూడా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

తిరుపతి జిల్లాల్లో సస్పెండ్ అయిన అధికారుల్లో తిరుపతి డీఎస్పీ ఎ.సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి ఇన్‌స్పెక్టర్ రామచంద్రారెడ్డి ఉన్నారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట డీఎస్పీ వీఎస్‌ఎన్ వర్మ, గురజాల డీఎస్పీ ఎ.పల్లపు రాజు, ఇన్‌స్పెక్టర్లు కె.ప్రభాకరరావు, ఇ.బాల నాగిరెడ్డి, కారెంపూడి ఎస్‌ఐ రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్‌ఐ డివి కొండారెడ్డిలను కమిషన్ సస్పెండ్ చేసింది. అనంతపురం జిల్లాలో సస్పెండ్ అయిన వారిలో తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, తాడిపత్రి ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ ఉన్నారు. ఇలాంటి హింస పునరావృతం కాకుండా చూడాలని సీఎస్, డీజీపీలను పోల్ ప్యానెల్ ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరిని ఆదేశించింది.

ఫలితాల ప్రకటన తర్వాత జరిగే హింసను నియంత్రించడానికి కౌంటింగ్ తర్వాత 25 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)ని 15 రోజుల పాటు తమ వద్ద ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. కౌంటింగ్ తర్వాత 25 సీఏపీఎఫ్‌ కంపెనీలను 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉంచాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కమిషన్ నిర్ణయించింది. ఎన్నికల ముందు దాడి, ఎదుటి పక్షాల ఆస్తులు/కార్యాలయానికి నిప్పు పెట్టడం, బెదిరింపులు, ప్రచార వాహనాలను ధ్వంసం చేయడం, రాళ్లదాడి మొదలైన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఈ ఘటనలు అన్నమయ, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లోనే ఎక్కువగా జరిగాయి.

Next Story