ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వర్సిటీ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
"'నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే గొప్ప నాయకులను అవమాన పరిచినట్లే. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లే. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే?'' అని షర్మిల ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్సార్ కి ఆ ఖ్యాతిని ఇవ్వాల్సిన అవసరం లేదని షర్మిల అన్నారు. వైఎస్సార్ కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదని అన్నారు.
బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ 'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను తీర్చడంపై ప్రభుత్వానికి శ్రద్ధలేదని.. పేర్లను మార్చడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదు' అని అన్నారు. మద్య నిషేధం విధిస్తామని చెప్పిన జగన్... మహిళలను మోసం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు.