Andhrapradesh: బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది.
By అంజి Published on 15 Oct 2024 6:25 AM ISTAndhrapradesh: బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత 48 గంటల్లో మరింత బలపడి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోకి దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రేపు రెండు, మూడు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యాకరులు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి రావాలని సూచించారు. ఇప్పటికే విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత వేగంగా పెరుగుతోందని, బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చని ఐఎండీ జీఎఫ్‌ఎస్ అంచనా వేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాలకు ముందుగానే పంపిస్తున్నట్టు తెలిపారు. తుపాను షెల్టర్లను సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వర్షాల నేపథ్యంలో పోలీస్, పంచాయతీరాజ్, జలవనరులు, ఆర్ అండ్ బీ శాఖల సిబ్బంది అలర్ట్ చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.