AP: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 13 March 2024 10:21 AM ISTAP: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు, పార్టీ సభ్యులు వార్డులను సందర్శించినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, సీసాలు విసురుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సభ్యులను వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. త్వరలోనే కేసు నమోదు చేసి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ఓ అధికారి తెలిపారు.
ఇదిలావుండగా.. రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు, తెలుగుదేశం పార్టీ (టిడిపి), భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనసేన పార్టీ (జెఎస్‌పి) ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. టీడీపీ అధినేత, ఆంధ్రా మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తమ పార్టీ తన కూటమి భాగస్వాముల మధ్య “బలమైన సీట్ల షేరింగ్ ఫార్ములాను రూపొందించిందని” ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఆరు స్థానాల్లో, టీడీపీ 17 స్థానాల్లో, జేఎస్పీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో, టీడీపీ 144 స్థానాల్లో, జేఎస్పీ 21 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆ కూటమిపై పోరుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ''ఎన్నికలు ముందున్నాయి. కూటమికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. బలహీన వర్గాలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది'' అని అన్నారు.
2018 వరకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగమైన టీడీపీ.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కూటమిని పునరుద్ధరించుకుంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.