ఏపీలో ఒమిక్రాన్ క‌ల‌క‌లం.. ఒక్క రోజే రెండు కేసులు..!

Second Omicron case detected in Andhra Pradesh.ఏపీలో క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేపుతోంది. ఒక్క

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 3:53 PM IST
ఏపీలో ఒమిక్రాన్ క‌ల‌క‌లం.. ఒక్క రోజే రెండు కేసులు..!

ఏపీలో క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేపుతోంది. ఒక్క రోజే రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. తొలుత విజ‌య‌న‌గ‌రానికి చెందిన వ్య‌క్తికి ఒమిక్రాన్ పాటిజివ్‌గా రాగా.. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే తిరుప‌తిలో మ‌రో వ్య‌క్తికి పాజిటివ్‌గా వ‌చ్చింది. ఒకే రోజు రెండు ఒమిక్రాన్ కేసులు న‌మోదు కావ‌డంతో స్థానిక ప్రజల్లో భయాందోళన వాతావరణ నెలకొంది. కాగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.

విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. విజయనగరానికి చెందిన వ్యక్తి తొలుత‌ ఐర్లాండ్‌ నుండి ముంబైకి వచ్చాడు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా.. అతడికి నెగెటివ్‌ వచ్చింది. ఆ తర్వాత అతడు ముంబై నుండి విశాఖపట్నం వచ్చాడు. విశాఖలో మరోసారి ఆర్టీపీసీఆర్‌ కరోనా టెస్ట్‌లు చేశారు. అనంతరం అతడి నమూనాలను సీసీఎంబీకి పంపించారు. ఈ పరీక్షల్లో అతడికి ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందని తేలింది.

ఇక యూకే నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐకి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నెల 8న యూకే నుంచి ఢిల్లీ మీదుగా తిరుపతి వచ్చారు. ఈ క్ర‌మంలో ఆదివారం అత‌డికి జీనోమ్ సీక్వెన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అతనితో పాటు తల్లిదండ్రులను వైద్యులు ఐసోలేట్ చేశారు. వారి నమూనాలను మరోసారి పరీక్ష కోసం స్విమ్స్‌కు పంపారు. రెండో కేసు విషయమై వైద్యశాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

శ‌నివారం సాయంత్రం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం రాష్ట్రంలో 31,131 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 156 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,708కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,465గా ఉంది. 24 గంటల వ్యవధిలో 188 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 2058289కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,954 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,07,46,537 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story