ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఎస్ఈసీ ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన పార్టీ ప్ర‌తినిధుల‌తో ఎన్నిక‌ల సంఘం మాట్లాడిందని ఎస్ఈసీ వెల్ల‌డించింది. పంచాయతీ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ వాలంటీర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు.

వాలంటీర్లతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయించవద్దని సూచించిన నిమ్మగడ్డ.. పార్టీలు, అభ్యర్థుల తరపున కూడా వాళ్లు ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. మొత్తంగా వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story