కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు
Search on for missing students in Krishna river. ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి శుక్రవారం
By అంజి Published on 17 Dec 2022 12:34 PM IST
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి శుక్రవారం ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుండగా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది మత్స్యకారులు, డైవర్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడకు చెందిన 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు స్నానానికి యెనమలకుదురు సమీపంలోని నదికి వెళ్లారు.
మొదట ఒడ్డున స్నానం చేసి, లోతైన నీటిలోకి ప్రవేశించి మునిగిపోవడం ప్రారంభించారు. దీంతో నది దగ్గర కూర్చున్న విద్యార్థి ఒకరు సహాయం కోసం కేకలు వేశారు. కొందరు మత్స్యకారులు సహాయక చర్యలు చేపట్టి వారిలో ఒకరిని సురక్షితంగా బయటకు తీయగా, మరొకరు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి రెవెన్యూ, ఇతర శాఖల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా చేరారు.
9వ తరగతి చదువుతున్న ఇ.గుణశేఖర్ (14), 10వ తరగతి చదువుతున్న టి.కామేష్ (15) మృతదేహాలను శుక్రవారం అర్థరాత్రి వెలికితీశారు. మిగిలిన బాలుర జాడ కోసం శనివారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం.బాలు, 9వ తరగతి చదువుతున్న షేక్ హుస్సేన్, 8వ తరగతి చదువుతున్న షేక్ బాజీ ఆచూకీ లేకుండా పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్నేహితులైన ఇద్దరు డ్రాప్ అవుట్‌లు కలిసి స్నానం చేసేందుకు నదికి వెళ్లారు.