AndhraPradesh: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏపీ లోని పాఠశాలలు జూన్ 13, 2024 నుండి తిరిగి తెరవబడతాయి.
By అంజి Published on 13 Jun 2024 9:13 AM ISTAndhraPradesh: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏపీ లోని పాఠశాలలు జూన్ 13, 2024 నుండి తిరిగి తెరవబడతాయి. గతంలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం కారణంగా వాయిదా పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌తో కూడిన ఎడ్యుకేషనల్ కిట్‌లను పాఠశాలల్లో తొలిరోజునే సరఫరా చేసే సంప్రదాయం గత ప్రభుత్వంలో ఉండేది. జగనన్న విద్యా కానుకగా పిలవబడే ఈ కిట్లను గత నాలుగేళ్లుగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కిట్లు, పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు వచ్చాయని, పంపిణీకి సంబంధించి కొత్త విద్యాశాఖ మంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. విద్యా కానుకలో భాగంగా.. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్ –తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్‌ను ఇచ్చేవారు. ఇక గతేడాది వరకు అనుసరించిన విధానంలోనే విద్యార్థులకు భోజనం అందించనున్నారు. కొత్త విద్యాశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.