అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో 19 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అతి భారీ వర్షాల కారణంగా కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లో కూడా అధికారులు సెలవులు ప్రకటించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏరులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల, కండలేరు జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. వర్షాలపై మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.