సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
అమరావతి: సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా గతంలో కోరేవాడినని.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంతో పాటు.. పేదలకు సాయం చేయాలని కూడా అడుగుతున్నానని చెప్పారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం పీ4 జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులుగా ఉండాలని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను కోరారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”పీ4 కార్యక్రమం గురించి తలుచుకున్న ప్రతిసారి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయగలం. నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపించాం. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన ఆంధ్రప్రదేశ్ లో, జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా క్రియాశీలంగా పని చేశాం. ఎన్నో సంస్కరణలు తెచ్చాను. కానీ ఎప్పుడూ కలగని తృప్తి.. పీ4 కార్యక్రమం ద్వారా కలుగుతోంది. సంస్కరణల వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడితే చాలు అవి అతి పెద్ద ప్రాజెక్టులుగా ఉండేవి.. కానీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల వల్లే ఇది సాధ్యమైంది. 1995లో టెక్నాలజీలో వచ్చిన సంస్కరణల ద్వారా ఫలాలను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక సంస్కరణలను కొందరు అందిపుచ్చుకున్నారు. కొందరు వెనుకబడ్డారు. సంస్కరణలను అందిపుచ్చుకున్న వారు ఉన్నత స్థానానికి చేరారు. అంబేద్కర్, ఎన్టీఆర్, అబ్దుల్ కలాం, మోదీ వంటి వారు సామాన్య కుటుంబాల్లోనే పుట్టారు. నాతో సహా ఈ సమావేశంలో ఉన్న చాలా మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చారు. నాడు సమాజం నుంచి ఎంతో సహకారాన్ని అందుకున్నాం.. ఉన్నతస్థితికి చేరాం. ఇప్పుడు అసమానతలు లేని సమాజం కోసం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు చేసేది చిన్న సాయమే కావచ్చు.. పేదరికంలో ఉన్నవారికి ఆ సాయమే అతి పెద్ద ఆలంబనగా ఉంటుంది.” అని చంద్రబాబు చెప్పారు.