అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. సెలవులు 19వ తేదీన ముగిసి, 20 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది. కాగా సంక్రాంతి సెలవులు కుదిస్తారని తొలుత ప్రచారం జరిగింది.
గతేడాది కురిసిన వర్షాలకు సెలువులు ఇచ్చారు. సంక్రాంతి టైంలో వాటిని కవర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే చర్చ జరిగింది. అయితే సెలవులు తగ్గించే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్రాంతి సెలవులపై క్లారిటీ రావడంతో.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు పండుగకి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రైలు, బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. కాగా తెలంగాణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులిచ్చింది. ఈ నెల 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయి.