కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారికి వ్యాక్సిన్స్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది మంది అస్వస్థతకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ పారిశుద్ద్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీలోని అంబేద్కర్ కాలనీలో పారిశుద్ద్య కార్మికుడు ఆర్ కృష్ణయ్య(49) నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో టీకా తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న అరగంట పాటు ఎలాంటి సమస్య లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడు. అయితే.. బుధవారం తెల్లవారుజామున కళ్లు తిరిగి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
కృష్ణయ్య మరణంపై అతడి కుమారుడు తిరుమల మాట్లాడుతూ.. తన తండ్రికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయని.. అయినప్పటికీ టీకా వేశారని ఆరోపించారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ.. టీకా తీసుకున్నది వాస్తవమే అయినా.. శవపరీక్ష నివేదికతోనే మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.